కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాల పట్ల కేంద్రం ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఆగమేఘాల మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయేతర కక్ష దాగినట్లు స్పష్టమవుతోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక్ సభ స్పీకర్ ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆ వెంటనే ఎంపీగా దక్కిన నివాసాన్ని ఖాళీ చేయమని హుకుం చేయడం అంత వ్యక్తిగత కక్ష లాగా అనిపిస్తోందన్నారు.
ఈ వ్యవహారంలో మోడీ అధానీ(Adani)ల చేతికి మట్టి అంటకుండా కేవలం సాంకేతిక అంశాలను పైకి చూపించి రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి అధికారిక నివాసం(Official House) నుంచి ఖాళీ చేయించారని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అనేక త్యాగాలు చేసిందని నారాయణ గుర్తు చేశారు అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ పై వ్యక్తిగత కక్షతో సాంకేతిక అంశాలను చూపించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తన ఢిల్లీ అధికారిక నివాస తాళం ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఈ పాపం ఊరికే పోదని దేశ ప్రజలు మరిచిపోరని, అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను సైతం గమనిస్తున్నారని బీజేపీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని నారాయణ(CPI Narayana) హెచ్చరించారు.
Read Also: మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు
Follow us on: Google News, Koo, Twitter