ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కిడ్నాపర్ల గాని హడలెత్తిస్తోంది. చిన్నపిల్లల కిడ్నాపర్ల(Children Kidnap) ముఠా సంచారం కలకలం రేపుతోంది. కిడ్నాపర్ల గ్యాంగ్ తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోడ్లపై తిరుగుతూ పిల్లల్ని ఎత్తుకు పోతున్నారంటూ ప్రచారం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతన్నారు. బుర్ఖా ధరించిన వ్యక్తులను చూస్తే చాలు.. పిల్లలు, పేరెంట్స్ బెంబేలెత్తుతున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కొద్దిరోజులుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చిన్నపిల్లలను ఎత్తుకుపోయే(Children Kidnap) ముఠా తిరుగుతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దీంతో పిల్లల్ని బయటకి పంపేందుకు పేరెంట్స్ జంకుతున్నారు. ఈ క్రమంలో రాయపర్తి మండలం బురహన్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద కిడ్నాపర్ల కలకలం రేపింది. స్కూల్ బయట బుర్ఖా ధరించి ఉన్న వ్యక్తులు కాపు కాస్తున్నారు అనే సమాచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరు మహిళలు ఆటోలో వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని గాబరా పడ్డారు. అనుమానాస్పదంగా కనిపించారని, వారిని చూసి కేకలు పెట్టారు. దీంతో స్కూల్ టీచర్స్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై విచారణ జరిపారు. అది కేవలం విద్యార్థుల అపోహ అని నిర్ధారణకు వచ్చారు. కిడ్నాపర్లు తిరుగుతున్నారనే వార్తలు నమ్మొద్దని చెబుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ పెద్దవారిని సైతం కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం పోలీసులకు చిక్కుముడిగా మారింది.