పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ(Mayor Vijayalaxmi) కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తదితర నేతలు పాల్గొన్నారు.
మరోవైపు విజయలక్ష్మి(Mayor Vijayalaxmi) తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు కూడా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. వీరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్(BRS) నేతలు హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.