KCR Resigns |తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం ఎదుర్కొంది. ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఓటమి బాధను కలిగించలేదని, నిరాశపరిచిందని ట్విట్టర్ ద్వారా ఆయన వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ కు వరసగా రెండుసార్లు విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు.. కానీ మాకు వ్యతిరేకంగా రావడంతో నిరాశ చెందా. దీన్ని గుణపాఠంగా తీసుకొని మళ్ళీ పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మా శుభాభినందనలు’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్.
మరోవైపు సీఎం కేసీఆర్(KCR) తన పదవికి రాజీనామా చేశారు. సీఎం ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కి పంపించారు. ఓఎస్డీ అధికారులు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై(Governor Tamilisai)కి అందించారు. మరోవైపు సీఎం ప్రోటోకాల్ వాహనాలను అధికారులు నిలిపివేశారు. వెనక్కి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్ నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కూడా రిటర్న్ అయింది. కేసీఆర్ తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. అయితే రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ తన రాజీనామా లేఖను అందిస్తారని అంతా భావిస్తుండగా.. ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపి, ఆయన ఫామ్ హౌస్ కి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది.