ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదనే ఓ నెటిజన్ అభిప్రాయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని అందులో తెలిపారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని.. వాటి బదులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే గెలిచేవాళ్లం అంటూ వ్యంగ్యంగా స్పందించారు. దీనిపై కాంగ్రెస్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ దుర్మార్గమైన పాలన భరించలేకే తమకు అవకాశం ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఓటమిని హుందాగా తీసుకుని రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారు. ఇదేం రాచరికం కాదని ఎల్లప్పుడూ మీరే అధికారంలో ఉండటానికి అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు. మరోవైపు గులాబీ శ్రేణులు మాత్రం కేటీఆర్(KTR) చెప్పింది వాస్తవమనేనని మద్దతు తెలుపుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే వాళ్లమని పేర్కొంటున్నారు.