KTR |టీఎస్పీఎస్సీపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు వెల్లడించారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన టీఎస్పీఎస్సీకి స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివితక్కువతనంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోనని హెచ్చరించారు. కోవిడ్ సమయంలోనూ 10వేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారన్నారు. తెలివి తక్కువతనంలో రేవంత్ తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇరువురి వ్యాఖ్యలు, వ్యవహారశైలితో మానసిక స్థితి కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు.
Read Also: మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ MP కోమటిరెడ్డి ప్రశంసలు
Follow us on: Google News Koo