Raghunandan Rao |సిరిసిల్ల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేటీఆర్ చేసిన తప్పులను నిరూపించి ఆయన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతానని సవాల్ చేశారు. రాజకీయ విలువలు దిగజారేలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మోడీని తిట్టాల్సినవన్నీ తిట్టి, తనకు సంస్కారం ఉందని, అందుకే తిట్టట్లేదని వ్యాఖ్యానించడంపై విరుచుకుపడ్డారు. వయసుకు గౌరవం ఇవ్వకున్నా, ప్రధాని పదవికైనా మర్యాద ఇవ్వాలని తప్పుబట్టారు. మోడీ ఎక్కడ బ్రోకరిజం చేశాడో కేటీఆర్(KTR) నిరూపించాలని డిమాండ్ చేశారు. హఫీజ్ పేట్‌లో భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీలు వేయలేదని ప్రశ్నించారు.
సర్వే నంబర్ 77లో 8 ఎకరాల భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఆ వ్యక్తికి లాభం చేకూరేలా కేటీఆర్ అపార్ట్ మెంట్ కట్టేందుకు అనుమతులిప్పించారని ఆరోపించారు. ఇది బ్రోకరిజం కాకుంటే ఏంటని ఆయన ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో విలాసవంతమైన బంగ్లాల కోసం రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయన్నారు. అన్ని తప్పులను నిరూపించి ప్రజాక్షేత్రంలో కేటీఆర్‌ను దోషిగా నిలబెడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్(KCR) మాటలే శాసనమైతే ముందు జైల్లో వేయాల్సింది కేటీఆర్‌నే అని సూచించారు. సిరిసిల్లలో ప్రధాని మోడీ(PM Modi)పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు. శ్రీరామనవమిలోపు కేటీఆర్ తన నోరును పినాయిల్‌తో కడుక్కుని నవమి తర్వాత నుంచి అయినా మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
Read Also: పాన్ కార్డుకు ఆధార్ లింక్ గడువు పెంపు
Follow us on: Google News, Koo, Twitter