‘ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలను బీజేపీ విస్మరించిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రజలు జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ట్విట్టర్లో బండి సంజయ్(Bandi Sanjay) చేసిన విమర్శలను తిప్పికొడుతూ కవిత(MLC Kavitha) ట్వీట్ చేశారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం ఇవ్వలేదని, దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవని ధ్వజమెత్తారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్‌లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి దేశంలో ఏర్పడిందని అన్నారు. మహిళలకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం జరుగుతోందని మండిపడ్డారు.