తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన- అభయహస్తం పేరిట 5 గ్యారెంటీలకి సంబంధించి ప్రజల నుంచి ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన డేటాను ఆన్ లైన్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి(Danthalapally) మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో డేటా ఎంట్రీ శరవేగంగా సాగుతుంది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తుల వివరాల ఆన్ లైన్ నమోదు కోసం ఆపరేటర్లు నిరంతరంగా శ్రమిస్తున్నారు. కాగా డేటా ఎంట్రీ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని మండల అధికారులు చెబుతున్నారు.
కాగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే మిగిలిన ఐదు పథకాలను కూడా అమలు చేసేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ హామీల అమలుకు ప్రభుత్వం 100 రోజుల గడువు కోరింది. ప్రస్తుతం ప్రజాపాలన ప్రత్యేక వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందుపరుస్తున్నారు. ఈనెల రోజుల్లో ప్రభుత్వం తరపు సిబ్బంది ఇచ్చిన సమాచారం నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకొని అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చనుంది. ఇక దరఖాస్తులు ఇచ్చిన వారంతా తమకి ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన రశీదు పత్రంలోని దరఖాస్తు నెంబర్ ను ఎంటర్ చేసి ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.