Raghunandan Rao – Smita Sabharwal | మణిపూర్‌లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించడంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ తెగకు చెందిన మహిళలను వివస్త్రలుగా మార్చి వీధుల్లో ఊరేగించడంపై మండిపడుతున్నారు. ఈ అంశంతో పార్లమెంట్ కూడా రెండు రోజులుగా దద్దరిల్లుతోంది. ఈ ఘటనపై ఇటీవల తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్(Smita Sabharwal) స్పందించారు. ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీడియా వెలుగులోకి తీసుకురావడంలేదేమని ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడు ఎలాంటి కలహాలు జరిగినా సరే అందులో మహిళలనే అవమానిస్తున్నారని స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాజాగా.. స్మితా సబర్వాల్ ట్వీట్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు.
‘బీజేపీ పాలిత రాష్ట్రాల ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్విట్లు పెట్టే స్మితా సబర్వాల్ గారు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం.’ అంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూ తగాదా విషయంలో ఓ దళిత మహిళపై గ్రామ సర్పంచ్, ఆమె కుటుంబ సభ్యులు కలిసి దాడి చేశారని దీనిపై మీరు ఎందుకు స్పందించరు?’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా స్మితా సబర్వాల్‌ను ప్రశ్నించారు.