ఖమ్మం జిల్లా సీనియర్ నేత రేణుకా చౌదరి(Renuka Chowdhury) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను సీటు అడిగితే కాదనే దమ్ము ఎవరికీ లేదని తెలిపారు. పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరామని.. ఆమె తన నిర్ణయకం తెలిపే వరకు కార్యకర్తలు ఓపిక పట్టాలని కోరారు. సోనియా పోటీ చేయకపోతే తానే ఎంపీ అభ్యర్థినని.. తనను కాదని ఇంకెవరికీ పోటీ చేసే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రేణుకా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని పేర్కొన్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారని.. వారంతా కలిసి ఖమ్మం అభివృద్ధికి కృషిచేస్తారనే ఆశాభావం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూ అక్రమాలపై విచారణ చేస్తామని హెచ్చరించారు. ఇక అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ ఎన్నికల కోసం వాడుకుంటుందని విమర్శించారు. బీజేపీ నేతలు ఆహ్వానిస్తే తాము వెళ్లాల్సిన అవసరం లేదని.. తమకు ఇష్టమైనప్పుడు అయోధ్యకు వెళ్లి రాములోరి దర్శనం చేసుకుంటామని రేణుకా(Renuka Chowdhury) వెల్లడించారు.