తెలంగాణ గవర్నర్ తమిళి సై(Governor Tamilisai) ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన దశాబ్ది అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆమె తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని.. వారి త్యాగాలు మరువలేనివి అని తెలిపారు. ఈ సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమకారులను గవర్నర్ సన్మానించారు. అలాగే తెలంగాణ అభివృద్ధిలో కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరుపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు.
తెలంగాణ అంటే హైదరాబాద్(Hyderabad) ఒక్కటే అభివృద్ధి చెందడం కాదని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందింతేనే ప్రజలంతా సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొంత మంది మాత్రమే అభివృద్ధి చెందారని.. దానిని అభివృద్ధి ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పిలుపిస్తున్నా.. సరికొత్త తెలంగాణ నిర్మాణం చేసుకుందామన్నారు. ప్రజలందిరికీ తాను ఉన్నానని గవర్నర్(Governor Tamilisai) భరోసా ఇచ్చారు. దీంతో వేడుకల వేళ తమిళిసై వ్యాఖ్యలు ప్రభుత్వానికి కౌంటర్‌గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.