మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi) బీజేపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సరికాదని సూచించానని.. కానీ అధిష్టానం తన మాట వినలేదన్నారు. అందుకు కారణం ‘బీజేపీలో కేసీఆర్ నాటిన ఓ మొక్క’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొక్క మాటలు నమ్మిన కమలం పెద్దలు బండి సంజయ్(Bandi Sanjay)ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని తెలిపారు. ఇలాంటి కారణాలతోనే బీజేపీకి రాజీనామా చేశానని స్పష్టంచేశారు. ఇటువంటి నేతల పట్ల బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సీఎం కేసీఆర్(KCR) అవినీతిపై చర్యలు తీసుకుంటామంటే బీజేపీలోకి వెళ్లానని.. కానీ ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాని మోదీ దగ్గర కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిని కక్కించటం ఖాయం అని వెల్లడించారు.
కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక్కరోజులోనే విజయశాంతి(Vijayashanthi)కి కీలక పదవి అప్పగించారు. పార్టీ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా ఆమెను అధిష్టానం నియమించింది. దీంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల బీజేపీకి రాములమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.