ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతకంటే దారుణమైన అవమానం తెలంగాణ పోరాట యోధులకు, మేధావులకు, కళాకారులకు వేరే ఉంటుందా? మాది ఉద్యమాల పునాదులపై, త్యాగాల ఊపిరితో ఏర్పడిన ‘పార్టీ, ప్రభుత్వం’ అని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకునే కేసీఆర్ గారు.. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని(Martyrs’ Stupa) రూపొందించిన 85 సంవత్సరాల యాదగిరి రావు గారి బిల్లు ఇప్పటికీ క్లియర్ చెయ్యలేదంట. అర్ధ శతాబ్దం సరే, సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యం వహించారనుకుందాం. మరి పదవిలోకి వచ్చి మీరు తొమ్మిదేండ్లు, ఈపాటి చిన్న రుసుము చెల్లించలేరా? మీ దొంగ కాంట్రాక్టర్లకు పైసలు పెంచి మరీ అడ్వాన్సులు ఇస్తారు కదా? ఇక్కడ చేతులు తడపలేరన్న లోకువా! కమీషన్ల కక్కుర్తితో సిసలైన తెలంగాణవాదాన్ని, పోరాటపటిమను, నేర్పును అవమానిస్తారా? అసలైన తెలంగాణవాదం మీ అవినీతి పాలన చెరలో ఉంటే, మోసగాళ్లు, బంధిపోట్లు గద్దెనెక్కి రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారు. రూ.5లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచి, మీరు మాత్రం మీ జేబులు నింపుకుంటున్నారు. తెలంగాణకోసం పోరాడిన వారికి మాత్రం వెన్నుపోటు మీ కానుకా?’’ అని ట్విట్టర్ వేదికగా షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.