8 కోట్ల అవినీతి బాగోతం : యువ టిఆర్ఎస్ నేత పై వేటు

8 crore corruption by young TRS leader

0
80

ఆయన ఒక యువ టిఆర్ఎస్ నేత. నిన్నమొన్నటి వరకు టిఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేశారు. తర్వాత ఆయనకు సిఎం కేసిఆర్ మాంచి పదవి కట్టబెట్టారు. ఇంకేముంది… సహచర అధికారితో కుమ్మక్కయ్యారు. ఇద్దరు కలిసి 8 కోట్లకు పైగా లంచాలు ముట్టించుకున్నారు. విషయం సర్కారు పెద్దలకు పొక్కింది. ఇంకేముంది ఇద్దరి మీద వేటు వేసేశారు. హైదరాబాద్ లో చర్చనీయాంశమైన ఈ కేసు వివరాలు ఇవీ…

టిఆర్ఎస్ పార్టీలో విద్యార్థి విభాగం నాయకుడిగా వి.రామనర్సింహ గౌడ్ చురుకుగా పనిచేశారు. తెలంగాణ రాకముందు నుంచీ ఆయన ఉద్యమంలో ఉన్నారు. దీంతో ఆయన సర్వీస్ మెచ్చి సిఎం కేసిఆర్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. కానీ పదవిని సర్వీస్ కోసం వాడుకుని రాజకీయాల్లో పైకి ఎదగాలన్న ఆకాంక్ష కాకుండా అడ్డమార్గంలో అప్పనంగా డబ్బు రాబట్టే మార్గాలపై దృష్టి సారించారు. ఇంకేముంది… మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తో కుమ్మక్కయ్యాడు. ఇద్దరూ కలిసి 8 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి 176 మంది వ్యాపారులకు గడ్డి అన్నారం మార్కెట్ లో కొత్తగా లైసెన్సులు జారీ చేశారు. ఈ అవినీతి బాగోతంపై పత్రికల్లో కథనాలు గుప్పుమన్నాయి.

దీంతో మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ విభాగం వారు విచారణ జరిపారు. విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అవినీతి జరిగిన మాట నిజమేనని విచారణలో తేలింది. దీంతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామనర్సింహ గౌడ్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పై వేటు పడింది. ఈ అక్రమాలపై సిఎం కేసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్క్తం చేసినట్లు తెలిసింది. ఇద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర స్థాయి డిడి హోదా అధికారి (ప్రవీణ్ కుమార్ హోదా డిప్యూటీ డైరెక్టర్ )ని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి అని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే రామనరసింహ గౌడ్ పదవీకాలం మరో నాలుగు నెలల్లో పూర్తికానుంది. ఆయన పదవీకాలం రెండేళ్లు పూర్తచేసుకుని పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ అవినీతిలో కూరుకుపోయి ముందుగానే పదవి పోగొట్టుకున్నాడు.