ఆజింక్య రహానే షాకింగ్ కామెంట్స్.నా క్రెడిట్ వాళ్లు తీసుకున్నారంటూ..

0
91

చూడచక్కని షాట్లు ఆడుతూ టెస్టు స్పెషలిస్ట్​గా గుర్తింపు పొందిన క్రికెటర్​.. ఆజింక్య రహానే. గత కొన్ని నెలలుగా ఫామ్​ కోల్పోయిన ఈ క్రికెటర్​.. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలకు వేరే వాళ్లు క్రెడిట్​ తీసుకున్నారంటూ పేర్కొన్నాడు.

 ప్రస్తుతం ఫామ్​ కోల్పోయి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా టెస్టు స్పెషలిస్ట్​ ఆజింక్య రహానే జట్టులో ఒకప్పుడు కీలక ఆటగాడిగా ఉండేవాడు. మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సారథ్యంలో అప్పటి టెస్టు జట్టుకు వైస్​ కెప్టెన్​గా వ్యవహరించిన రహానే.. ఎన్నో సందర్భాల్లో కోహ్లీ లేని లోటును భర్తీ చేశాడు. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​ అందుకు ఉదాహరణ. కోహ్లీ గైర్హాజరులో రెండో టెస్టు నుంచి జట్టును నడిపించిన రహానే.. ఓటమి అంచుల్లో ఉన్న జట్టుకు విజయం అందించాడు. రహానే కెప్టెన్సీపై అప్పట్లో క్రికెట్​ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. అయితే అప్పటి సిరీస్​కు సంబంధించి రహానే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు దక్కాల్సిన క్రెడిట్​ ఇంకెవరో దక్కించుకున్నారన్నాడు.

“ఆస్ట్రేలియా పర్యటనలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు. ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయం గురించి చెప్పుకుని.. క్రెడిట్ కొట్టేయాలనుకోవడం నా స్వభావం కాదు. మైదానంలో నేను తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్‌ గొప్ప విజయాలు సాధించింది. కానీ, వాటికి క్రెడిట్ వేరెవరో తీసుకున్నారు. ఏదేమైనా, మా జట్టు సిరీస్‌ గెలవడం చాలా ముఖ్యం.

నా ఫామ్‌పై వస్తున్న విమర్శలను చూసి నవ్వుకుంటాను. ఆట గురించి తెలియని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, ఆ తర్వాత టెస్టుల్లో నేను రాణించిన తీరు గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, ఆస్ట్రేలియా పర్యటన నా కెరీర్లో మరిచిపోలేనిది. ఆట గురించి తెలిసిన వాళ్లు, ఆట పట్ల అభిమానం ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. నా సామర్థ్యంపై పూర్తి నమ్మకముంది. మునుపటి ఫామ్‌ అందుకుని బ్యాటుతో సత్తా చాటగలను. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది.”రహానే ప్రత్యేకించి ఎవరి పేరును ప్రస్తావించలేదు. అయితే, అప్పటి హెడ్ కోచ్‌ రవిశాస్త్రిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రవిశాస్త్రి ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో పదే పదే ఈ విజయం గురించి చెప్పుకున్న విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టి.. సమర్థంగా జట్టుని నడిపించిన రహానేపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.