దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ సినీ,రాజకీయ, ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ముందు పలువురు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ టోర్నీ నిర్వహణ సందిగ్ధంలో పడింది. టోర్నీ జరిగేది అనుమానమే అనే వార్తలు వచ్చాయి. ఇదే విషయమై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు.
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా షెడ్యూల్ ప్రకారమే టోర్నీ నిర్వహిస్తామని గంగూలీ వెల్లడించారు. టోర్నీ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ ఈ నెల 13న ప్రారంభమై మార్చి 20 వరకూ జరగనుంది. గ్రూప్ దశలోని తటస్థ మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లకు కోల్‌కతా వేదిక కానుంది.
సోమవారం బంగాల్‌తో పాటు ముంబయి క్రికెట్ జట్టులో పలువురికి కరోనా సోకింది. యువ క్రికెటర్ శివం దూబెకు కూడా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో ఈ టోర్నీ నిర్వహణపై పలు అనుమానాలు రేకెత్తాయి. రంజీ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టారు.