పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా మరోసారి చురక అంటించాడు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య అటు మైదానంలో, ఇటు సామాజిక మాధ్యమాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అక్తర్ చేసిన ఓ సరదా ట్వీట్‌కు భజ్జీ తనదైనశైలిలో స్పందించాడు. అతడి పోస్టుకు దీటుగా బదులిచ్చాడు.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్‌లో మరో కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇరు జట్లలోని పలువురు దిగ్గజ క్రికెటర్లు దుబాయ్‌కు చేరుకున్నారు. హర్భజన్, అక్తర్ ఓ చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ ఫొటోను పాక్ మాజీ పేసర్ ట్విటర్‌లో పంచుకొని.. ‘అన్నీ తెలుసనుకునే మిస్టర్ హర్భజన్ సింగ్‌తో భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాను’ అంటూ అక్తర్ పోస్టు చేశాడు.
దీనికి స్పందించిన హర్భజన్ చురక అంటించాడు. ‘టెస్టుల్లో 200 వికెట్ల కన్నా తక్కువ ఉన్న ఆటగాడి కంటే.. 400కి పైగా వికెట్లున్న ఆటగాడికే క్రికెట్ గురించి ఎక్కువ తెలుసు’ అని దీటుగా స్పందించాడు. టెస్టుల్లో అక్తర్ 178 వికెట్లు తీయగా హర్భజన్ 417 వికెట్లు తీశాడు.