రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ సారి 10 జట్లు పాల్గొనబోతున్నాయి. అయితే ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
సన్ రైజర్స్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆటగాళ్ల వేలం సమయంలో ఆటగాళ్ల కొనుగోలు, ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు దిఆస్ట్రేలియన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముందు ఇది సన్ రైజర్ హైదరాబాద్ జట్టుకు కోలుకోని దెబ్బనే చెప్పుకోవాలి.
ఆటగాళ్ల కొనుగోలు విషయంలో స్టార్లను వదిలేసి అంతగా పేరులేని ఆటగాళ్లను కొనుగోలు చేశారు. దీనిపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సన్ రైజర్స్ అసలు స్ట్రాటజీనే అవలంభించలేదని తెలుస్తుంది. ఈ కారణం చేతనే అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.