BREAKING NEWS | తెలంగాణ రైతులకు శుభవార్త : జూన్ 15 నుంచి ఖాతాల్లోకి రైతుబంధు డబ్బు

0
105
KCR visits Kondagattu

 

జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన  కాటగిరీ ల వారిగానే  రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు.  కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం ఆదేశించారు.

ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్ధిక సాయం వ్యవసాయాభివృద్దికి దోహద పడుతున్నదని సిఎం అన్నారు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు ఖాతాలోనే జమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పంటసాయం వల్ల రైతు శావుకారు దగ్గరికి అప్పుకు పోకుండా సకాలంలో వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు విత్తనాలు కొని పంటకు పెట్టుబడి పెట్టి అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని సిఎం అన్నారు. ఉద్యోగుల నియామకం వంటి చర్యలతో వ్యవసాయ శాఖను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, వారి కృషి కూడా ప్రభుత్వ లక్ష్యానికి తోడయిందన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా కూడా అభివృద్ధిని సాధించగలిగామని, ఇట్లా వొక్కటొక్కటి గా వ్యవసాయనుబంధ రంగాలను అభివృద్ది పరుచుకుంటూ రావడం సంతోషకరమన్నారు.

వెదజల్లే పద్దతిని ప్రోత్సహించాలె…వ్యవసాయ శాఖ అధికారులకు సిఎం ఆదేశం :

వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగు చేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖపై శనివారం ప్రగతి భవన్ లో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఈ పద్దతిలో వరి సాగు చేసే అంశంపై తెలంగాణ రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశిచారు. ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చని అన్నారు .

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ …  ” నారు పోసే పని లేదు . నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతయి. వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు , లిఫ్టులు , సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ వరి నాటులో వెదజల్లే పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే రైతులను పిలిచి ఈ విధానం గురించి స్టడీ చేశాను . నేను స్వయంగా రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగు చేసి మంచి ఫలితాలను పొందాను. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు సల్లడానికి యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నయి. తెలంగాణలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచిది” అని సీఎం వివరించారు.

ప్రగతి భవన్ లో రైతాంగ అంశాలపై సిఎం కేసిఆర్ సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఈ సమావేశంలోనే పై ఆదేశాలు జారీ చేశారు.