ధోనీతో విభేదాలు..క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్

0
76

ఒకరేమో టీమిండియా మాజీ సారధి, మరొకరేమో మాజీ ఆటగాడు, స్టార్ ఓపెనర్. ఒకే జట్టు సభ్యులు కానీ వారి మధ్య విభేదాలంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అవి నిజామా కాదా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఇంతకీ వారెవరో కాదు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్.

2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ధోనీ 97 రన్స్ ప్రదర్శన, 2012లో ఆస్ట్రేలియాతో సీబీ సిరీస్ లో కెప్టెన్ గా ధోనీ వైఫల్యం సహా వివిధ సందర్భాల్లో ధోనీపై గంభీర్ విమర్శలు కురిపించాడు. దీంతో ఇద్దరి మధ్య చెడిందన్న కథనాలు వినిపించాయి. అయితే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలపై గౌతీ వివరణ ఇచ్చాడు. యూట్యూబ్ లో జతిన్ సప్రూ నిర్వహించిన ‘ఓవర్ అండ్ ఔట్’ షోలో దానికి సంబంధించిన విషయాలను వివరించాడు. తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఎప్పుడూ ఉంటుందని, ధోనీకి ఏ అవసరం వచ్చినా తనవైపు నిలబడే మొదటి వ్యక్తిని తానేనని చెప్పాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు.

‘‘ఇంతకుముందు చాలా షోల్లో చాలా సార్లు చెప్పాను.. ఇప్పుడు మీ షోలో కూడా చెబుతాను. 138 కోట్ల మంది ప్రజల ముందు ఎక్కడ చెప్పమన్నా చెబుతాను. ధోనీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది. మా మధ్య గొడవల్లేవు. ధోనీకి ఎవరితోనూ అవసరపడకపోవచ్చుగానీ.. భవిష్యత్ లో ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే అతడికి నేను అండగా ఉంటాను. మనసున్న మనిషిగా ప్రజల కోసం, భారత క్రికెట్ కోసం అతడు చేసిన సేవలు మరువలేనివి’’ అని గౌతమ్ చెప్పుకొచ్చాడు.

ఏదైనా విషయంపై నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయని, అంత మాత్రాన ఇద్దరికీ గొడవలున్నాయని ఎలా అనుకుంటారని ప్రశ్నించాడు. ఆటను ఒకరు ఒకలా చూస్తారు..ఇంకొకరు ఇంకొకలా ఆలోచిస్తారని చెప్పాడు. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు.. చాలా ఏళ్లపాటు తాను వైస్ కెప్టెన్ గా ఉన్నానని, ఐపీఎల్ వంటి ఆటల్లో ప్రత్యర్థులమని చెప్పాడు. కాగా, ధోనీ నెంబర్ 3లో బ్యాటింగ్ చేసి ఉంటే వన్డే మ్యాచ్ లలో ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేవాడంటూ మరోసారి గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పాడు.