IPL అభిమానులకు అదిరిపోయే వార్త.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

0
100

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్‌ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు.

భారత్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టోర్నీ నిర్వహణ ఇక్కడ కష్టంగా మారితే.. ప్రత్యామ్నాయంగా విదేశీ వేదికలను సైతం ఎంచుకునే వీలుందని ఆయన వివరించారు. అంతకంటే ముందు ఐపీఎల్‌ మెగా వేలంపైనే బీసీసీఐ ప్రధానంగా దృష్టిసారించిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది కొత్తగా రెండు జట్లు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకుంటుండగా ఆటగాళ్ల వేలం ఆలస్యం కానుంది.

దీన్ని ఫిబ్రవరి తొలివారంలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ టోర్నీ జరిగే సమయానికి కేసులు అధికమైతే ఏం చేస్తారనే విషయాన్ని ప్రస్తావించగా.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవసరమైతే విదేశాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అధికారి స్పష్టం చేశారు. కానీ, తొలి ప్రాధాన్యత మాత్రం భారత్‌లోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.