కివీస్​తో పోరు..అఫ్గాన్​ గెలిచేనా?

Fight with Kiwis..will the Afghan win?

0
101

అబుదాబి వేదికగా నేడు న్యూజిలాండ్​తో తలపడనుంది అఫ్గానిస్థాన్. టోర్నీలో ముందుకెళ్లాలంటే ఇరు జట్లకు విజయం అవసరం. కాగా, టీమ్​ఇండియా భవితవ్యం అఫ్గాన్​ గెలుపుపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్​ గెలిచి తీరాలని భారత క్రికెట్​ ప్రేమికులు ప్రార్థిస్తున్నారు. మరి ఈ కీలక మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో చూడాలి.

ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ వచ్చివుండదేమో. సెమీస్‌ రేసులో నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు భారత్‌ చేతిలో లేదు. గ్రూప్‌-2లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీసేన నిలవాలంటే న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవాలి. కివీస్‌ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ముందంజ వేస్తుంది. భారత్‌ కథ ముగుస్తుంది. నమీబియాతో చివరి మ్యాచ్‌ నామమాత్రమవుతుంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో గెలిచినా భారత్‌ ఖాతాలో ఆరు పాయింట్లే (మూడు విజయాలు) ఉంటాయి. ఒకవేళ అఫ్గానిస్థాన్‌ సంచలనం సృష్టిస్తే భారత్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

అయితే ఫామ్‌లో ఉన్న కివీస్‌ను ఓడించడమే అఫ్గానిస్థాన్‌కు చాలా కష్టమైన పని. శుక్రవారం నమీబియాపై అలవోకగా నెగ్గిన న్యూజిలాండ్‌. ఈ మ్యాచ్‌లో రెట్టించిన విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమయ్యాక జట్టును ఆదుకున్న నీషమ్‌, ఫిలిప్స్‌.. నమీబియాకు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ లక్ష్యం నమీబియాకు చాలా పెద్దదైపోయింది.

టోర్నమెంట్లో నిలకడగా రాణిస్తున్న కివీస్‌ బౌలర్లతో అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌కు కూడా సమస్యలు తప్పవు. ఒకరకంగా మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించేది వాళ్లే. ఇప్పటిదాకా అఫ్గానిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఫర్వాలేదనిపించినా..బౌల్ట్‌, సౌథీ, మెల్నేలు పదునైన పేస్‌ను, సోధి, శాంట్నర్‌ల స్పిన్‌ మాయాజాలాన్ని తట్టుకుని నిలవడం వారికి సవాలే.

అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఓ మాదిరి స్కోరు చేయగలిగితే.. రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలోని బౌలింగ్‌ దళం ప్రభావం చూపగలుగుతుంది. అయితే గాయంతో ముజీబ్‌ దూరం కావడం వల్ల ఆ జట్టుకు ప్రతికూలాంశమే అనడంలో సందేహం లేదు. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే కివీస్‌కు సవాలు మాత్రం తప్పదు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది మ్యాచ్‌ గమనంలో కీలకం కానుంది.