టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు ఐపీఎల్ లో కూడా మంచి రికార్డులు ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో రెండుసార్లు 2012, 2014లలో కప్పు తీసుకువచ్చాడు. 2017 వరకు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన గంభీర్..2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథిగా బాధ్యతలు స్వీకరించాడు.
అయితే కెప్టెన్సీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక అదే సంవత్సరం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ కు గత కొద్ది సీజన్ ల నుంచి దూరంగా ఉంటున్నాడు. అయితే వచ్చే ఏడాది రాబోతున్న ఐపీఎల్ 2022 కి గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈసారి గంభీర్ ప్లేయర్ గా కాకుండా మెంటార్ గా మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు.
ఐపీఎల్ కు కొత్త గా వచ్చిన లక్నో జట్టు గౌతమ్ గంభీర్ ను మెంటార్ నియమించింది. దీంతో వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు గౌతమ్ గంభీర్ మెంటార్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. అయితే లక్నో జట్టు ఐపీఎల్ 2022కి సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే ఆ జట్టుకు ప్రధాన కోచ్ గా ఆండీ ఫ్లవర్ ను ఎంపిక చేసింది. అలాగే కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను తీసుకోవడానికి సంప్రదింపులు జరుపుతుంది. అలాగే ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ కూడా జట్టులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.