డాక్యుమెంట్ రైటర్స్ కు ప్రభుత్వం షాక్ – అక్కడకు నో ఎంట్రీ!

Government shocks document writers - no entry there!

0
95

ఏపీ ప్రభుత్వం డాక్యుమెంటరీ రైటర్లను ఇతర వ్యక్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయాలలోనికి అనుమతించరాదని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంటరీ రైటర్లు సబ్ రిజిస్ట్రార్లను ప్రలోభపరుస్తున్నారని అందువల్ల వారిని దూరంగా పెట్టాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ వివిధ సబ్ రిజిస్ట్రార్ అఫీసుల్లో తనిఖీలు నిర్వహించగా సబ్-రిజిస్ట్రార్లు తమకు తాబేదార్లుగా డాక్యుమెంట్ రైటర్లలను నియమించుకున్నారని వారికి బినామీలుగా ఉంటూ ఏరోజు కారోజు వచ్చిన పర్సంటేజీలు మామూళ్ళు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముగిసిన తర్వాత పంచుకుంటున్నారని అవినీతి నిరోధకశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఒక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 295 సబ్ రిజిస్ట్రార్ అఫీసులున్నాయి. ఒక్కొక్క కార్యాలయంలో 15 మంది డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ ఉత్తర్వులు 1995 జనవరి 9న జారీ అయ్యాయి. తిరిగి ఈ నెల 17న సర్క్యులర్ మెమో నెంబర్ విజిలెన్స్ 2/82 64/ 2021 ప్రకారం ఆదేశాలు జారీ అయ్యాయి.

సాధారణంగా డాక్యుమెంట్ రైటర్లు బ్రిటిష్ కాలం నుండి వంశపారంపర్యంగా పని చేస్తున్నారు. వారి పరిధిలో సర్వే నెంబర్లు, భూమి రికార్డులుంటాయి. సాధారణంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్లు తమదైన శైలిలో డాక్యుమెంట్లను తయారు చేస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా వీరి లైసెన్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. వీటికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్ లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంతో డాక్యుమెంటరీ రైటర్లు హైకోర్టును ఆశ్రయించనున్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అరకొరగా సిబ్బంది ఉండడంతో రిజిస్ట్రేషన్ విషయంలో డాక్యుమెంటరీ సిబ్బంది సహాయ సహకారాలను అందించడం పరిపాటి. 2014 జనవరి 18న ఉమ్మడి రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు అప్పట్లో పెద్దఎత్తున సమ్మె చేశారు. అప్పట్లో వారం రోజులపాటు ఉమ్మడి రాష్ట్రంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను మీ-సేవకు అప్పగించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని డాక్యుమెంట్ రైటర్ల సమ్మె చేశారు. జనవరి 14 నుండి 22 వ తేదీవరకు అప్పట్లో సమ్మె జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు వెలవెల పోవడంతో అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ ప్రభుత్వ ప్రతిపాదనలను విరమింపజేశారు.

నేడు తిరిగి అదే రీతిలో డాక్యుమెంటరీ రైటర్లు సమ్మె చేయనున్నారు. ఇదిలా ఇలా ఉండగా రాష్ట్ర అసోసియేషన్ ఆదివారం నాడు సమావేశమై కమిషనర్ వి రామకృష్ణ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.