తిరుమల వెళ్లే భక్తులు రూమ్స్ దొరకవు అన్న ఆందోళనతో ఉంటారు. కొందరికి రూమ్స్ బుకింగ్ ప్రాసెస్ తెలియక అవస్థలు పడుతుంటారు. తిరులలో ఇకపై రూమ్స్ బుకింగ్ చాలా సులభతరం చేసింది టిటిడి.
భక్తుల సౌకర్యార్థం జూన్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తిరుమలలోని 6 ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కోసం పేర్ల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తున్నది.
ఇప్పటి వరకు తిరుమలలో రూమ్స్ కోసం సి.ఆర్.ఓ వద్ద పేర్లు నమోదు చేసుకున్నవారికి గదుల కేటాయింపు జరుగుతున్నది. కొత్తగా
1 జి.ఎన్.సి టోల్ గేట్ సమీపంలోని లగేజ్ కౌంటర్ వద్ద,
2 బాలాజి మెయిన్ బస్టాంట్ వద్ద,
3 కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియాలో,
4 రాంభగీచ బస్టాండ్ ఏరియాలో,
5 ఎంబిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద,
6 సిఆర్ఓ వద్ద రెండు కౌంటర్ల చొప్పున భక్తులకు రూమ్స్ కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టిటిడి. పేర్లు నమోదు చేసుకున్న వారి సెల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తారు.
అనంతరం వారికి కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాల వద్ద పేమెంట్ చేసి గదులు పొందవచ్చు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. బుధవారం నాడు 11,770 మంది భక్తులు తిరుమల దర్శనానికి వచ్చారు. హుండీ ఆదాయం 1.34 కోట్లు లభించింది. జూన్ నెలలో ఇప్పటి వరకు ఇదే అధికం కావడం గమనార్హం.