అంతర్జాతీయ క్రికెట్‌కు తాను వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని అన్నాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్. రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించడం ఇష్టం లేదని అన్నాడు. జట్టులో కొనసాగే ఉద్దేశం తనకులేదని, ఈ విషయం తమ బోర్డుకు కూడా తెలుసని ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ మోరిస్.. తుది జట్టుకు ఎంపిక అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే మోరిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇకపై దేశవాళీ క్రికెట్, టీ20 లీగ్‌లపైనే దృష్టి సారిస్తానని మోరిస్ చెప్పుకొచ్చాడు. ‘దేశవాళీ జట్టులో ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. దక్షిణాఫ్రికా జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. అది నాకు దక్కిన గొప్ప అవకాశం.’ అని మోరిస్ అన్నాడు.
దాదాపు ఏడాది నుంచి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో తనకు సంబంధాలు లేవని వెల్లడించాడు. ఆ దేశ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య జరిగిన వివాదంపై తనకు అవగాహన లేదని చెప్పాడు. 2012 నుంచి అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మోరిస్ 42 వన్డేలు, 23 టీ20లు, 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2019 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా తరఫున చివరిసారిగా ఆడాడు.