టీ20 ర్యాంకింగ్స్ విడుదల..పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్

ICC releases latest T20 rankings

0
74

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్​ విభాగంలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా..ఓపెనర్​ కేఎల్ రాహుల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా చివరి మూడు మ్యాచ్​ల్లో రాహుల్ అర్ధశతకాలతో అదరగొట్టాడు. దీంతో కోహ్లీని వెనక్కినెట్టి ఐదో స్థానానికి చేరుకున్నాడు.

టీ20 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన మార్​క్రమ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో 25 బంతుల్లో 52 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఉత్తమ టీ20 ఆల్​రౌండర్ల జాబితాలోనూ ఏడో స్థానానికి చేరుకున్నాడు మార్​క్రమ్. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్​ డర్ డస్సెన్ ఉత్తమ ప్రదర్శనతో ఆరు స్థానాలు ఎగబాకి టాప్​ 10లో చోటు సంపాదించుకున్నాడు. టీ20 ఉత్తమ బ్యాటర్ల జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ రెండో స్థానంలో నిలిచాడు.

టీ20 ఉత్తమ బౌలర్ల ర్యాంకింగ్స్​లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, జోష్ హేజిల్​వుడ్. ఆస్ట్రేలియా సెమీస్​ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన జంపా ఐదో స్థానానికి చేరుకోగా..హేజిల్​వుడ్ ఏకంగా 11మందిని వెనక్కినెట్టి 8వ స్థానానికి చేరాడు. కివీస్​ బౌలర్​ టిమ్​ సౌథీ 9వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ 797 రేటింగ్ పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా.. దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ రెండో స్థానంలో నిలిచాడు.