సినీ నటుడు, దర్శకుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరణంతో ఒక్క సారిగా చిత్ర సీమలో విషాదం అలముకుంది. సినీ ప్రముఖులు అందరూ సంతాపం తెలిపారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు మహేష్.
కత్తి మహేశ్ చిత్తూరు జిల్లా వాసి. పీలేరులో పుట్టి పెరిగారు. ఆయనకి ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. ఆయన తండ్రి వ్యవసాయ శాఖలో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మైసూర్ రీజినల్ కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసిన మహేష్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదివారు. చిన్న తనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. అన్ని సినిమాలు చూసేవారు కత్తి మహేష్.
ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్ లో రాఘవేంద్ర మహత్య్మం సీరియల్ కి పనిచేశారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన భార్యది వెస్ట్ బెంగాల్.ఇద్దరు గతంలో యూనిసెఫ్కు పనిచేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
కత్తి మహేష్ బిగ్ బాస్స్ సీజన్ 1 లో పాల్గొన్నారు. సాయి రాజేష్ తనకి స్నేహితుడు కావడంతో హృదయ కాలేయం సినిమాలో అవకాశం వచ్చిందని చాలాసార్లు చెప్పుకొచ్చారు. కత్తి మహేష్ పెసరట్టు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇలా టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించారు కత్తి మహేష్.