షేన్‌ వార్న్​ మరణంపై వీడిన మిస్టరీ..అసలేం జరిగిందంటే?

0
96

స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ మరణంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. అతని గదిలో రక్తపు మరకలు ఉండడం ఈ ప్రశ్నలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.  సోమవారం వార్న్‌ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన అనంతరం.. ఆయనది సహజ మరణమేనని వైద్యులు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. వైద్యులు అందించిన ఆ నివేదికను వార్న్‌ కుటుంబానికి, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపినట్లు తెలిపారు.

‘‘వార్న్‌కు సంబంధించిన వస్తువులు పోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఘర్షణ జరిగినట్లు కూడా కనిపించడం లేదు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా అతనిది సహజ మరణమే అని ఆసుపత్రి డైరెక్టర్‌ చెప్పాడు. వార్న్‌కు ఛాతీ నొప్పి కలిగిందని, తిరిగి వచ్చాక ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నాడని అతని తండ్రి వెల్లడించాడు. ఇది సహజ మరణమే హత్య కాదు’’ అని ఏసీపీ జనరల్‌ సురాహేత్‌ తెలిపారు.

వార్న్ గుండెపోటుతోనే లెజెండరీ క్రికెటర్‌ తుదిశ్వాస విడిచాడని వైద్యులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు . కాగా వార్న్‌ హఠాన్మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు థాయ్‌ల్యాండ్ పోలీసులు. విచారణలో భాగంగా అతడు బస చేసిన విల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కాగా వార్న్‌ మరణించిన గదిలో ఫ్లోర్‌, టవల్స్‌పై రక్తపు మరకలు గుర్తించామని థాయ్‌ పోలీసులు షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ థాయ్‌ మీడియా కూడా కథనాలను ప్రసారం చేసింది. దీంతో వార్న్ మృతిపై ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి. దీంతో వార్న్‌ పార్థివ దేహానికి పోస్ట్‌ మార్టం నిర్వహించారు. తాజాగా పోస్ట్ మార్టం ఆధారంగా వార్న్ ది సహజ మరణమే అని పోలిసులు నిర్ధారించారు.