కర్నూలు జిల్లాలోని పేలుడు ప్రదేశాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. ఏపీలో ఇకనైనా అక్రమ మైనింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి, ఆయా శాఖల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని అన్నారు. 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని స్థానిక యువత తన దృష్టికి తీసుకొచ్చినట్లు పవన్ తెలిపారు. క్వారీలో పేలుడు ఘటనలకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమని, సీఎం చంద్రబాబు ప్రజాసమస్యలను విస్మరించకూడదని సూచించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.