టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

0
109

టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ల పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. దీంతో ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్‌ మహేల జయవర్దనే, సీనియర్‌ కోచ్‌లు టామ్‌ మూడీ, గ్యారీ కిరిస్టెన్‌లు ప్రదాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసినట్టు అనధికారిక సమాచారం. అయితే ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు వచ్చే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో ఇప్పటివరకు ఈ నలుగురు కోచ్‌ రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే మరో దిగ్గజ కోచ్‌ టీమిండియా ప్రధాన కోచ్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ కూడా భారత్‌ ప్రధాన కోచ్‌ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. రెండుమూడు రోజుల్లోనే ఆయన బీసీసీఐకి దరఖాస్తు పంపించే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరేళ్లుగా కివీస్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు సేవలందించాడు. దీంతో భారత్‌లోని పరిస్థితుల, ఆటగాళ్ల గురించి అవగాహన ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన కోచింగ్‌లోనే కివీస్‌ 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. దీంతో అనుభవం, ప్రతిభ దృష్ట్యా హెస్సన్‌ కూడా టీమిండియా కోచ్‌గా అన్ని విధాల అర్హుడు అంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ నియామక ప్రక్రియ బాధ్యతను చేపట్టిన దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, అన్షుమన్‌ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) కోచ్‌గా ఎవరిని నియమిస్తుందా అని అందరిలోనూ అసక్తి రేకెత్తిస్తోంది.