దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానే మరోసారి దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే వీరి ఫామ్‌పై స్పందించాడు మాజీ బ్యాటర్ సునీల్ గావస్కర్.
ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇక టెస్టు క్రికెట్‌లో కొనసాగాలంటే చివరగా ఒక్క అవకాశమే మిగిలి ఉందని మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
“పుజారా, రహానే వరుస బంతుల్లో విఫలమవ్వడం చూస్తే.. సగటు వ్యక్తి ఎవరైనా.. వాళ్లు టెస్టుల్లో కొనసాగడానికి ఇక ఒక్క అవకాశమే మిగిలి ఉందని అనుకుంటారు. జట్టులో వారి స్థానాలపై ఇప్పటికే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవ్వడం విచారకరం. ఇకపై వాళ్లు టీమ్ఇండియాలో కొనసాగాలంటే రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడటం ఒక్కటే వారు చేయాల్సింది” అని గావస్కర్ అన్నారు.