దినేష్ కార్తీక్ ప్రస్తుతం టీంఇండియాలో ప్రముఖంగా వినిపిస్తున్న ఆటగాడి పేరు. జట్టులో ఇక చోటు దక్కడమే కష్టం అనుకున్న తరుణంలో ఐపీఎల్ 2022 పుణ్యమా అని తన ఆటతో భారత జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఎంపిక చేసే భారత జట్టులో డీకే స్థానంపై ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
తాజాగా దినేష్ కార్తీక్ పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగి రెండు మూడు ఓవర్లు మాత్రమే ఆడాతానంటే కుదరదని, ఆ రోల్‌కు సంపూర్ణ న్యాయం జరగాలంటే ఆల్‌రౌండర్ అయితేనే బెటర్ అని అభిప్రాయపడ్డాడు. డీకే కేవలం రెండు, మూడు ఓవర్లు ఆడేందుకు మాత్రమే పరిమితమైతే, కార్తీక్‌కు బదులుగా రిషబ్ పంత్, దీపక్ హూడా, జడేజా, హార్థిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లను ప్రిఫర్ చేస్తానని పేర్కొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఉన్న జట్టులో కార్తీక్‌కి చోటు దక్కుతుందని అనుకోవడం లేదని తెలిపాడు. కార్తీక్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో పాటు సుదీర్ఘంగా క్రీజ్‌లో ఉండటంపై కాన్సంట్రేట్ చేయాలని సూచించాడు. తుది జట్టులో ఆడించే ఛాన్స్ లేనప్పుడు డీకేను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడంలో ఉపయోగం లేదని అన్నాడు. అలా అయితే అతన్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం వృధా అని అన్నాడు.