కరోనా సోకిన అటవీశాఖ ఉద్యోగులకు అవసరమైతే ఆయుష్ మందులు

0
39

కరోనా విపత్తు సమయంలోనూ నిత్యం విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది, ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ నిర్ణయించింది. మారు మూల అటవీ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉన్న ఉద్యోగులు,వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు టెలీ మెడిసిన్ సేవలను అటవీ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థతో అటవీ శాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

కరోనా లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు, లక్షణాలు ముదిరితే తక్షణ స్పందన, తదితర విషయాలపై అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండటంతో పాటు, అవసరం అయితే తక్షణ వైద్యం అందించటమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ వెల్లడించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ డాక్టర్లు, ప్రతినిధులతో కలిసి పీసీసీఎఫ్ ఇవాళ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఫ్రంట్ లైన్ వర్కర్లతో సమానంగా అడవుల్లో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులు ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఒక వేళ కరోనా లక్షణాలు కనిపించినా, భయపడకుండా వెంటనే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స ప్రారంభించాలని, టెలీ మెడిసిన్ లో 24 గంటల పాటు డాక్టర్లు, కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ హాస్పటల్ లో చేర్చేందుకు అవసరమైన ఏర్పాటు కూడా ఈ సంస్థ చేస్తుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కరోనా సోకినా ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా చికిత్సా విధానాలను కొనసాగించాలని కోరారు. కరోనా నుంచి కోలుకున్నాక వచ్చే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ విషయంలోనూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అండగా ఉంటుందని, అవసరం మేరకు ఆయుష్ మందులను కూడా ఉద్యోగులకు అందుబాటులో ఉంచుతున్నామని పీసీసీఎఫ్ వెల్లడించారు.

ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శీనివాస్, వివిధ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, హెల్పింగ్ హ్యాండ్ నుంచి ముజ్తాబా అస్కారి, డాక్టర్ హుమేరా, అన్ని జిల్లాల అటవీ అధికారులు, బీట్ అధికారి స్థాయి వరకు సిబ్బంది పాల్గొన్నారు. శాఖ ఉద్యోగుల విషయంలో చొరవ తీసుకుని ఆన్ లైన్ టెలీ మెడిసిస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన పీసీసీఎఫ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.