IPL: నయా ఢిల్లీ- కప్పు కొట్టేనా?..పంత్ సేన బలాలు, బలహీనతలు ఇవే..

0
117

ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని మూడు జట్లలో ఒకటైన దిల్లీ. జట్టు నిండా యువ ఆటగాళ్లు, సరిపడ విదేశీ స్టార్స్, అద్భుతమైన కోచింగ్ స్టాఫ్ ఇది ఢిల్లీ బలం. కానీ ఐపీఎల్ కప్పు వీరికి ఓ కలలాగే మిగిలిపోయింది. 2019 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చుకొని ఆట తీరును మెరుగుపరుచుకుంది. గత మూడు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత, 2020లో రన్నరప్‌ గా నిలిచి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. మరి ఈసారైనా ఢిల్లీ ఆ ఒక్క అడుగు వేసి కప్పు కొడుతుందా? పంత్ సేన బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

శ్రేయస్ అయ్యర్ ఏ క్షణాన గాయపడ్డాడో ఏమో కానీ పంత్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. దీనితో శ్రేయస్ ను రెటైన్ కూడా చేసుకోలేదు ఢిల్లీ యాజమాన్యం. రిషబ్‌ పంత్‌ (రూ.16 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ.9 కోట్లు), పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), అన్రిచ్‌ నోకియా (రూ.6.5 కోట్లు)లను అంటిపెట్టుకుంది. అంతేకాదు మెగా వేలంలో ప్రత్యేక వ్యూహంతో ఆటగాళ్లను కొనుగోలు చేసి సగం మ్యాచ్ లు గెలిచేసింది ఢిల్లీ.

బలాలు: 

పృథ్వీ షా, వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, పంత్‌, పావెల్‌, అక్షర్‌, శార్దూల్ ఏ క్షణంలోనైనా ఆట స్వరూపాన్ని మార్చగలిగే ప్లేయర్స్. బ్యాటింగ్ లో వార్నర్, పృథ్వీ షా, పంత్, మార్ష్ ఉండనే ఉన్నారు. బౌలింగ్ లో నార్జ్, ఎంగిడి, ముస్తాఫిజుర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శార్దూల్‌, చేతన్‌ సకారియా, నాగర్‌కోటి లాంటి పేసర్లు ఉన్నారు. అలాగే స్పిన్ విభాగంలో అక్షర్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్ ఉన్నారు. అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, స్పిన్నర్‌ విక్కీ ఆసక్తి కలిగిస్తున్నారు. అవకాశం వస్తే ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్‌ భరత్‌, అశ్విన్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

బలహీనతలు:

కాగితం మీద చూడడానికి అన్ని రకాలుగా బలంగా ఉన్న దిల్లీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లకు వార్నర్‌, మూడు మ్యాచ్‌లకు మార్ష్‌ దూరం కానున్నారు. ఇది ఢిల్లీకి దెబ్బనే చెప్పుకోవాలి. నోకియా ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నాయి. కొన్ని మ్యాచ్‌లకు అతనూ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక యోయో టెస్టు విఫలమైన పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి. పావెల్‌ కూడా గాయపడ్డాడనే వార్తలొస్తున్నాయి. ఎంగిడి, ముస్తాఫిజుర్‌ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు. స్పిన్‌ భారమంతా అక్షర్‌పైనే పడొచ్చు. కుల్‌దీప్‌ కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేని పంత్‌.. షాట్ల ఎంపికలో జాగ్రత్తపడాలి. లేదంటే ఢిల్లీ జట్టుకు కష్టాలు తప్పవు.

దేశీయ ఆటగాళ్లు: పంత్‌, అశ్విన్‌ హెబ్బర్‌, మన్‌దీప్‌ సింగ్‌, పృథ్వీ షా, కేఎస్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌, కమలేష్‌ నాగర్‌కోటి, లలిత్‌ యాదవ్‌, ప్రవీణ్‌ దూబె, రిపల్‌ పటేల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, విక్కీ ఓస్త్‌వాల్‌, యశ్‌ ధుల్‌, చేతన్‌ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌, ఖలీల్‌ అహ్మద్‌

విదేశీయులు: వార్నర్‌, పావెల్‌, సీఫర్ట్‌, మిచెల్‌ మార్ష్‌, నోకియా, ఎంగిడి, ముస్తాఫిజుర్‌

కీలక ఆటగాళ్లు: పంత్‌, వార్నర్‌, నోకియా, పృథ్వీ షా, శార్దూల్‌, అక్షర్‌.