టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటివ్వడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పరిమిత ఓవర్ల టీమ్‌లో స్థానం దక్కని అశ్విన్‌ను ఏకంగా వరల్డ్‌కప్‌కు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. మొత్తానికి దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అశ్విన్ మళ్లీ నైపుణ్యాలను మెరుగుపరచుకున్నందుకే అతన్ని ఎంపిక చేసినట్లు చెప్పాడు.
ఇప్పుడు అతడు వైట్ బాల్ క్రికెట్‌లో చాలా ధైర్యంగా బౌలింగ్ చేస్తున్నాడని కోహ్లి అన్నాడు. ఐసీసీ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..విరాట్ ఈ కామెంట్స్ చేశాడు. దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో అశ్విన్ బాగా బౌలింగ్ చేశాడని, అతని నియంత్రణ, చూపించిన వేరియేషన్లు యూఏఈలో బాగా పనికొస్తాయని కోహ్లి అన్నాడు.
గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో అశ్విన్ కొన్ని క్లిష్టమైన ఓవర్లు వేశాడు. టాప్ ప్లేయర్స్‌కూ బౌలింగ్ చేశాడు. పవర్ హిట్టర్లను చూస్తే స్పిన్నర్లు కాస్త భయపడతారు. కానీ అశ్విన్ తన నైపుణ్యాన్ని నమ్ముకున్నాడు. అంతేకాదు అతడు ఎంతో అనుభవజ్ఞుడు. ఇలాంటి వాళ్లు తమ బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలరు అని కోహ్లి చెప్పాడు. మణికట్టు స్పిన్నర్ల కంటే ఫింగర్స్ స్పిన్నర్లు చాలా కచ్చితంగా బౌలింగ్ చేస్తారనీ అతడు అన్నాడు.