ఐసీసీ పురుషుల టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన నలుగురు ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చోటు దక్కించుకున్నారు. మిగతా ఇద్దరు ఆటగాళ్లలో శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా, ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాటర్ జోస్ బట్లర్ ఉన్నారు. కాగా ఇందులో భారత్ క్రికెటర్లు చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియన్ జట్టులో భాగమైన మార్ష్ 27 మ్యాచ్‌లలో 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు. అలాగే 18.37 సగటుతో ఎనిమిది వికెట్లు తీశాడు. క్యాలెండర్ ఇయర్ మొత్తంలో మార్ష్ పొట్టి ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా స్పిన్‌కు వ్యతిరేకంగా స్ట్రైక్ రొటేట్ విషయంలోనూ అద్భుతంగా రాణిస్తూ ఆకట్టుకున్నాడు.
ఇక పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ 29 మ్యాచ్‌లలో 73.66 సగటు, 134.89 స్ట్రైక్ రేట్‌తో 1326 పరుగులు సాధించాడు. అతను స్టంప్‌ల వెనుక కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ సమయంలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు.
ఏడాది పొడవునా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన హసరంగ, టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ హ్యాట్రిక్ సాధించాడు. టోర్నమెంట్‌ను 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఐర్లాండ్‌పై 71 పరుగులతో సూపర్ నాక్ ఆడి ఆకట్టుకున్నాడు.