ఎస్పీ రాజకుమారి రంగంలోకి దిగారు : గంటల్లో మ్యాటర్ సెటిల్

0
108

జిల్లా ఎస్పీ చొరవతో గంటల వ్యవధిలో తప్పిపోయిన బాలుడ్ని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు. అసలు ఎలా జరిగిందంటే…

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన పల్లా సీతయ్య, ఆమె భార్య గౌరి
తమ దగ్గరి బంధువు పండ్ల వ్యాపారం చేసుకుంటూ, పట్టణంలోని కాట వీధిలో ఉంటున్న లక్ష్మణ్ కు చేయి విరిగడంతో పరామర్శించేందుకుగాను తమ పిల్లలతో కలిసి జూన్ 28న విజయనగరం వచ్చారు. లక్ష్మణ్ ను పరామర్శిస్తున్న సందర్భంలో గౌరి కుమారుడు పల్ల హేమంత్ (5 సం.లు) ఇల్లు విడిచి మద్యాహ్నం 3 గంటల సమయంలో బయటకు వెళ్ళిపోయాడు. చిన్న పిల్లవాడు కావడం, వెళ్ళిన దారిని గుర్తించకపోవడంతో హేమంత్ తిరిగి వారి బంధువుల ఇంటికి చేరుకోలేకపోయాడు. హేమంత్ తప్పిపోయిన విషయాన్ని గుర్తించిన బంధువుల సుమారు 15మంది పట్టణంలో పలు ప్రాంతాలను సందర్శించి, తప్పి పోయిన బాలుడు హేమంత్ ను వెతకడం ప్రారంభించారు. కానీ, వారు ఆచూకీ గుర్తించపోవడంతో బాలుడి తల్లిదండ్రుల్లోఆందోళన మొదలైంది.

కర్ఫ్యూ నిబంధనలను అమలు చేసేందుకు ముఖ్య కూడళ్ళలో ఉన్న పోలీసు బృందాలు ద్వారా బాలాజీ జంక్షన్ వద్ద జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఉన్నట్లుగా తెలుసుకున్న తప్పిపోయిన బాలుడి మేనమామ నేరుగా అక్కడకు చేరుకొని, జిల్లా ఎస్పీ కి బాలుడు తప్పిపోయిన విషయాలను తెలిపి, కొన్ని ఫోటోలను జిల్లా ఎస్పీకి పంపారు. వెంటనే, జిల్లా ఎస్పీ బి. రాజకుమారి పోలీసు యంత్రాంగాన్ని వైర్ లెస్ సెట్ లోను, వాట్సాప్ గ్రూపుల్లో పంపి అప్రమత్తం చేయడంతో విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, విజయనగరం 2వ పట్టణ సిఐ సిహెచ్. లక్ష్మణరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, బ్లూ కోల్ట్ బృందాలు స్పందించి, గాలింపు చర్యలు చేపట్టాయి.

అదే సమయంలో ఘోషాసుపత్రిలో తప్పిపోయిన బాలుడ్ని ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు యువకులు గుర్తించి, వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసు బృందాలు అక్కడ చేరుకోవడం, దొరికిన బాలుడ్ని తప్పిపోయిన బాలుడు హేమంత్ గా గుర్తించడంతో కథ సుఖాంతం అయ్యింది.

బాలాజీ జంక్షన్ వద్ద కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ బి. రాజకుమారి వద్దకు పోలీసులు తప్పిపోయిన బాలుడ్ని తీసుకురావడంతో, బాలుడు తల్లిదండ్రులు గౌరి, సీతయ్యలకు బాలుడు హేమంత్ ను అప్పగించారు. జిల్లా ఎస్పీ చొరవతో తప్పిపోయిన బాలుడ్ని గంటల వ్యవధిలోనే గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది.

జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి బాలుడు తల్లిదండ్రులు సీతయ్య, గౌరి, మేనమామ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి తప్పిపోయిన బాలుడ్ని గుర్తించిన ఇద్దరు యువకులను, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ
బి.రాజకుమారి అభినందించారు.