టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ ఎవరు..రేసులో ఎవరు ఉన్నారంటే?

Who is the Vice Captain of Team India? Who is in the race?

0
110

టీమ్‌ఇండియా వన్డే పగ్గాలను ఓపెనర్‌ రోహిత్ శర్మకు అప్పగించిన సెలెక్షన్‌ కమిటీ.. త్వరలోనే యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇన్నాళ్లు కోహ్లీకి డిప్యూటీగా ఉన్న రోహిత్‌కి‌ బీసీసీఐ తాజాగా కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. దీంతో తదుపరి వైస్‌ కెప్టెన్‌ ఎవరు అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన కోసం వన్డే జట్టును ప్రకటించే సమయంలోనే.. కేఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.

యువ ఆటగాడు కేఎల్ రాహుల్‌ గత కొన్నేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడు ఇంకో కొన్ని ఏళ్లు క్రికెట్‌ ఆడగలడు. అందుకే టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ పదవికి అతడు సరిపోతాడనిపిస్తోంది. కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మల నుంచి చాలా విషయాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా కేఎల్‌ రాహుల్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మరోవైపు, యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించే విషయంపై కూడా బీసీసీఐ వర్గాలు చర్చిస్తున్నాయి. ‘రిషభ్‌ పంత్‌ ఇంకా సీనియర్ల నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పుడే బాధ్యతలు అప్పగిస్తే.. అతడిపై మరింత భారం మోపినట్లవుతుంది. అందుకే పంత్ విషయంలో మరి కొంత కాలం వేచి చూస్తే మంచిదనిపిస్తోంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.