కోల్‌కతా- బెంగళూరు ఢీ..ఎలిమినేటర్‌లో నిలిచేదెవరో?

Who will stand in the Kolkata-Bangalore collision eliminator?

0
81

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎలిమినేటర్‌లో గెలిచి టైటిల్‌ రేసులో నిలిచేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తహతహలాడుతున్నాయి. బలాబలాల్లో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో దాంట్లో గెలిచాయి. 14 మ్యాచ్‌ల్లో.. 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంతో ఆర్సీబీ ముందంజ వేయగా.. ఏడింట్లో నెగ్గిన కేకేఆర్‌ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన చివరి జట్టుగా నిలిచింది.

లీగ్‌ ఆరంభం నుంచి ఆర్సీబీ జోరు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా చివరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీపై ఆఖరి బంతికి కేఎస్‌ భరత్‌ సిక్సర్‌తో విజయాన్ని అందుకున్న జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌, కోహ్లి, అద్భుత ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌తో పాటు తెలుగు కుర్రాడు భరత్‌తో కూడిన బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ఇక బౌలింగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న హర్షల్‌ (30)తో పాటు సిరాజ్‌, గార్టన్‌ల పేస్‌ త్రయం ప్రత్యర్థికి సవాలు విసిరేదే. ఇక స్పిన్నర్‌ చాహల్‌ బంతితో మాయ చేస్తున్నాడు.

మరోవైపు తొలి ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్స్‌కు చేరుతుందా? అనిపించిన కేకేఆర్‌.. గొప్ప పోరాట స్ఫూర్తితో యూఏఈ అంచెలో మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించి ముందంజ వేసింది. బ్యాటింగ్‌లో భారత కుర్రాళ్లు శుభ్‌మన్‌, వెంకటేశ్‌, త్రిపాఠి, నితీశ్‌ కీలకంగా మారారు. స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌, షకీబ్‌తో పాటు పేసర్లు ఫెర్గూసన్‌, శివమ్‌ జోరుమీదున్నారు.