Alltimereport : పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill) విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ లో లోక్ సభ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన దక్షిణాది ప్రయోజనాలను కాపాడుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదన అమలుతో తెలంగాణాలో లోక్ సభ స్థానాలు ప్రస్తుతం 17 ఉండగా.. 26 కి పెరుగుతాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని, అందుకే బీఆర్ఎస్ (BRS) కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తోందని, వాటి అమలుకు కూడా కట్టుబడి ఉందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


