హిందీ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కుటుంబం నుంచి వచ్చిన సాయేషా సైగల్ ‘అఖిల్’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కోలీవుడ్ వైపు దృష్టి సారించింది. జయం రవి హీరోగా నటించిన ‘వనయుద్ధం’ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా విజయం సాధించకపోయినా హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చింది.
సాయేషా డాన్స్‌కి ప్రభుదేవా వంటి వారు ఫిదా అయిపోవడంతో ఒక్కసారిగా ఆమెకు పాపులారిటీ పెరిగిపోయింది. ఆ తరువాత కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం మంచి విజయం సాధించడంతో హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. ఆర్యతో నటించిన గజనీకాంత్, విజయ్‌సేతుపతి సరసన నటించిన జుంగా చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. అంచెలంచెలుగా ఎదిగిన సాయేషా ఇప్పుడు తమిళ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు సూర్య హీరోగా చేస్తున్న ఓ భారీ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది సాయేషా.