ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో తొలిసారి 25 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సెక్రటేరియట్ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అన్ని సామాజిక వర్గాలకూ తగిన ప్రధాన్యం ఉండేలా ఆయన మంత్రివర్గాన్ని ఎంపిక చేశారని తెలిసింది. ఇప్పుడు ప్రమాణం చేయబోయే 25 మంది మంత్రులూ రెండున్నర ఏళ్లపాటూ పదవిలో ఉంటారు. ఆ తర్వాత మరో 25 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఇలా మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో 50 మంది మంత్రి పదవుల్లో కొనసాగబోతున్నట్లు తెలిసింది. మరో 50 మందికి జిల్లాల్లో ఇన్ఛార్జులుగా నియమిస్తారని సమాచారం.
ఇక సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి గెలిచిన మాజీ మంత్రి తమ్మినేని సీతారంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ఎల్పీ సమావేశం అనంతరం తమ్మినేని సీతారం వైఎస్ జగన్‌తో భేటీకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు స్పీకర్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది.