భారత్‌- ఇంగ్లాండ్ ఐదో టెస్టు రీ షెడ్యూల్‌..ఎప్పుడంటే?

India-England Fifth Test re-scheduled..when?

0
89

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఈ ఏడాది ఇంగ్లండ్‌ వెళ్లిన టీమ్‌ఇండియా..నాలుగు మ్యాచ్‌ల తర్వాత కరోనా కలకలంతో ఆఖరి టెస్టు ఆడకుండానే ఐపీఎల్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టింది.

వచ్చే ఏడాది జూలైలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌ వెళ్లనుండగా..అదే సమయంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీబీ తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో ఉండగా..ఆఖరి టెస్టు వచ్చే ఏడాది జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగనుంది.

‘ఇరు దేశాల బోర్డులు చర్చించుకున్న తర్వాతే అర్ధాంతరంగా నిలిచిపోయిన టెస్టును తిరిగి నిర్వహించాలని నిర్ణయించాం’ అని ఈసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టెస్టు అనంతరం భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జూలై 7, 9, 10న మూడు టీ20లు..జూలై 12, 14, 17న మూడు వన్డేలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.