ఇండియా పోరాటం-కివీస్ ఆరాటం..గెలుపెవరిది?

India fight-Kiwis worry..who will win?

0
104

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌పై భారత్‌ జట్టు కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన. శుక్రవారం రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి మ్యాచ్‌లో మిడిలార్డర్‌ తడబడగా రెండో టీ20లో ఆ సమస్యను అధిగమించాలని యోచిస్తోంది. అటు రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి, సిరీస్‌ సమం చేయాలని కివీస్‌ ఆరాటపడుతోంది.

ఇండియా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో కొన్ని లోపాలు తలెత్తగా..వాటిపై జట్టు దృష్టి సారించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించగా, వన్‌ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌..అర్ధ శతకంతో రాణించాడు. రెండో మ్యాచ్‌లోనూ ముగ్గురు జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇండియాకు ప్రధాన సమస్య మిడిలార్డర్ వైఫల్యం. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌లో తడబడ్డాడు. తర్వాత వచ్చిన రిషభ్‌ పంత్ పర్వాలేదనిపించినా దూకుడుగా ఆడలేకపోయాడు. ఆరో స్థానంలో వచ్చిన వెంకటేష్‌ అయ్యర్ తన అరంగేట్రం మ్యాచ్‌లో రెండు బంతుల్లోనే పెవిలియన్‌ చేరాడు. బౌలింగ్ విభాగంలో సీనియర్లు భువనేశ్వర్‌ కుమార్‌, రవిచంద్రన్ అశ్విన్‌.. తమ స్థాయికి తగ్గట్టు రాణించి, చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన రెండో మ్యాచ్‌ కోసం కివీస్‌ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఓపెనర్‌ గఫ్తిల్‌, వన్‌డౌన్‌లో వచ్చిన.. మార్క్‌ చప్‌మన్‌ తొలి మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చడం కివీస్‌కు కలిసి రాగా..మిడిలార్డర్‌ కూడా స్థాయికి తగ్గట్టు రాణించడం పట్ల సంతోషంగానే ఉంది. అయితే బౌలింగ్‌ విభాగంలో లోపాలను సవరించుకోవాలని భావిస్తోంది. మ్యాచ్‌ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా టాస్‌ కీలకంగా మారింది.