ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్‌లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లోని టెస్టు సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కొంతకాలంగా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది మెల్బోర్న్లో సెంచరీ మినహా ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకూ ఇతడు ఎంపికయ్యేది అనుమానంగా మారింది. దీంతో రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం దాదాపు ఖాయమే. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముగిశాక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అందుకోసం త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. టీ20 సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా చేయనుండగా, వన్డేల్లోనూ హిట్‌మ్యాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది బీసీసీఐ.