రోహిత్​కు డిప్యూటీ హోదా..కారణం ఇదే!

Rohit gets deputy status..this is the reason!

0
42

ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్​గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్​లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్​గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్​లోని టెస్టు సిరీస్​కు హిట్​మ్యాన్​ను వైస్ కెప్టెన్​గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కొంతకాలంగా బ్యాటింగ్​లో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది మెల్​బోర్న్​లో సెంచరీ మినహా ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​లో కలిపి కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకూ ఇతడు ఎంపికయ్యేది అనుమానంగా మారింది. దీంతో రోహిత్​కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం దాదాపు ఖాయమే. న్యూజిలాండ్​తో రెండో టెస్టు ముగిశాక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అందుకోసం త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. టీ20 సిరీస్​కు రోహిత్ కెప్టెన్​గా చేయనుండగా, వన్డేల్లోనూ హిట్​మ్యాన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది బీసీసీఐ.