తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రవీందర్ సింగ్ సాధించే ఓట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గోయల్ పేర్కొన్నారు.