బండి సంజయ్ కు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తేడా ఏమి లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నడ్డా అంటే ఇన్నాళ్లు పెద్ద మనిషి అని అనుకున్నా..కానీ నడ్డా అబద్దాల అడ్డా..కేరాఫ్ ఎర్రగడ్డ అంటూ చురకలు అంటించారు. మోదీ ప్రభుత్వం చేసింది సున్నా, మా పథకాలనే కాపీ కొడుతున్నారు. మా పార్టీ విధానాలే మీ ఎన్నికల నినాదాలు అని విమర్శించారు.
రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన జుగుప్సా కరమైన, హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అసంబద్ధ వ్యాఖ్యలతో నడ్డా స్థాయి బండి సంజయ్ తోసమానంగా మారిపోయారు. బీజేపీ నేతల తీరు చూస్తే బీజేపీని బాక్వాస్ జుమ్లా పార్టీగా పేరు మార్చొచ్చు. బీజేపీ మీడియా ను మోడియా గా మార్చింది. మోడీ ఈ ఏడేండ్లలో చేసిన మంచి పని ఒక్కటి లేదు. బీజేపీ ని జుమ్లా పార్టీ అంటే మా మీద హంలా చేస్తారు. బీజేపీకి సీబీఐ, ఈడీ, భాగస్వామ్య పక్షాలుగా మారాయి.
యూపీలో బీజేపీ అభివృద్ధి పేరిట ఓట్లు అడగడం లేదు. విద్వేషాలు రెచ్చ గొట్టడంతోనే ఓట్లు పొందాలని బీజేపీ అక్కడ విష ప్రచారం చేస్తోంది. మోడీది సిగ్గు మాలిన ప్రభుత్వం. 2022 కల్లా ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని మోడీ హామీ ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి టాయిలెట్ నల్లా అన్నాడు మోడీ.. కనీసం గుజరాత్ లోనైనా ఇచ్చావా. జుమ్లా,హంలాలు బీజేపీ జుగల్ బందీగా మార్చి పాలన చేస్తోంది. పంజాబ్ లో రైతుల నిరసన తో పీఎం మోడీ పంజాబ్ లో ఎన్నికల సభను రద్దు చేసుకున్నారు. ఇంతటి దౌర్భాగ్యం ఏ పీఎంకు రాలేదు. కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన. నడ్డా అబద్ధాల అడ్డా కేర్ ఆఫ్ ఎర్రగడ్డ. అర పైసా ఉపయోగ పడే పని మోడీ దేశానికి ఏమైనా చేశారా. ఇంత దిక్కుమాలిన, దౌర్భాగ్యపు కేంద్ర ప్రభుత్వం ఉందా. కాళేశ్వరం కేసీఆర్ కు ఎటిఎం అంటావా. కేసీఆర్ నిజం ఎటిఎం యే.. ఏటీఎం అంటే అన్నదాతకు తోడుండే మెషిన్. దిక్కుమాలిన బీజేపీ కి మా ప్రభుత్వ పథకాలే కాపీ కొట్టడానికి పని కొస్తున్నాయి.
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా నడ్డా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కల్లాలలో వడ్ల నుంచి కంటోన్మెంట్ రోడ్ల దాకా అంతా బీజేపీ కిరికిరే. నీతి ఆయోగ్ కున్న నీతి నడ్డాకు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా..రైతులను ఢిల్లీలో బీజేపీ ఎంత ఇబ్బంది పెట్టింది. లక్షలాది మంది రైతుల గోస గుచ్చుకున్న చరిత్ర బీజేపీది. కేంద్ర మంత్రి బలుపుతో రైతులను కారుతో తొక్కించి చంపినా చర్యలు తీసుకోని బీజేపీ మా గురించి మా కుటుంబ పాలన గురించి బీజేపీ మాట్లాడమా. నడ్డా అత్త జయశ్రీ బెనర్జీ ఎంపీగా మంత్రి గా పని చేయలేదా. బీజేపీలో ఎంత మంది నాయకులు వారి వారసులు రాజకీయాల్లో లేరూ? మేము ఉద్యమాల్లో పాల్గొని ప్రజలు ఎన్నుకుంటే గెలిచాం. బీజేపీ పాలిత కర్ణాటక లో అవినీతి అత్యంత ఎక్కువ అని మీడియా సంస్థలు మేధావులు ఘోషిస్తున్నారు
.
నడ్డా అవినీతి గురించి మాట్లాడటమా నడ్డా పెద్ద పోటు గాడా? బండి సంజయ్ తన గుండు తానే పగుల గొట్టుకుంటున్నాడు. బండి పోతే బండి వస్తుంది.. గుండు పోతే గుండు వస్తుందా. తెలంగాణలో ఏం కొంపలు మునిగాయని నడ్డా హైద్రాబాద్ వచ్చాడు? బీజేపీ ఎర్రగడ్డ మాటలు, ఎర్రగడ్డ చేతలు ప్రజలు అన్నీ చూస్తున్నారు. మిషన్ భగీరథ గొప్పదని చెప్పిన మంత్రి షేకావత్ కు మెంటలా.. నీళ్లు రాలేవని చెప్పిన నడ్డాకు మెంటలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని సన్నాసి రేవంత్ అడిగితే కేంద్రమే పార్లమెంటులో జవాబిచ్చింది. కేంద్రం కరెక్టా.. నడ్డా కరెక్టా ఉద్యోగులకు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీని నమ్ముతారు. ఉద్యోగుల స్థానికత కోసమే 317 జీఓ ఇచ్చాము. మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారి తాటాకు చప్పుళ్లకు బెదిరే వారు ఎవ్వరూ లేరు. భయ పడితే తెలంగాణ వచ్చేదా. మార్కెట్ లో బీజేపీ కి భయపడే వారు ఎవరైనా ఉండొచ్చు. మేము కచ్చితంగా బీజేపీ వెంట పడుతూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం. దేంట్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేసీఆర్ తెలంగాణ బాగు కోసం పడుతున్న తపన ఎవరు అడ్డుకున్న ఆగదు. తప్పుడు ప్రకటనలతో బీజేపీ యూపీలో ఓట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. బొచ్చు ,రొచ్చు అరవింద్ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని ధీటుగా బదులిచ్చారు.